లాలు కొడుకుపై విష ప్రయోగం? | Sakshi
Sakshi News home page

విషం పెట్టి చంపాలనుకున్నారు.!

Published Fri, Feb 23 2018 11:53 AM

 Tejashwi Yadav Says Nitish Kumar Government Conspiring To Poison My Food  - Sakshi

పట్నా: నితీష్‌కుమార్‌ ప్రభుత్వంపై  ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు, బీహార్ అసెంబ్లీ విపక్ష నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వం తనను చంపాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే తాను తినే ఆహారంలో విషం కలపాలని ప్రయత్నించిందన్నారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న వేళ, ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్క్యూట్ హౌస్ లలో బస చేస్తుంటానని, అక్కడ విషం కలిపే ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈ విషయం ప్రభుత్వంలో తనకున్న విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసిందని తేజస్వీ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. "ఫోన్ ట్యాపింగ్ తరువాత నాపై హత్యా ప్రయత్నాలు జరిగాయి. నా ర్యాలీలకు వస్తున్న ప్రజలను చూసిన ప్రభుత్వానికి భయం వేసి ఈ పని చేయాలని ప్రయత్నించింది" అని ఆయన మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితమే తన ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపించిన ఆయన, తన యాత్రకు వస్తున్న ప్రజా స్పందనను ప్రభుత్వం తట్టుకోలేక పోతోందని కూడా వ్యాఖ్యానించారు. ఇక వచ్చె నెలలో బీహార్‌లో ఒక లోక్‌ సభ, రెండు అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తేజస్వీయాదవ్‌ యాత్ర చేపట్టారు. 

ఈ ఆరోపణలపై నితీష్‌ ప్రభుత్వం స్పందించింది. తేజస్వీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని మండిపడింది. ఉపఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ తెలిపారు. ఆర్జేడీ,జేడియూ,కాంగ్రెస్‌ల కూటమితో ఏర్పడిన ప్రభుత్వం చీలిపోయిన విషయం తెలిసిందే.  ఉపముఖ్యమంత్రిగా తేజస్వీయాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో గతేడాదే సీఎం నితీష్‌ కుమార్‌ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జతకట్టారు.

Advertisement
Advertisement